ఆదికాండము 45-47:12

ఉద్దేశము/ లక్ష్యము
దేవుడు తన ప్రజల పట్ల ఖచ్చితమైన ప్రణాళిక కలిగి యుంటాడు అని బోధించుట.

ముఖ్యాంశము
ఎంతో ఆశ్చర్యం కలిగించే వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? మీ తాతయ్య చనిపోయాడు అని లేదా మీ కుక్కకు బాగాలేదు అని ఇలా ఎన్నో. ఇటువంటి వార్తలు మనలను ఎంతో బాధిస్తాయి, కానీ కొన్ని వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. మీకు మంచి స్కూల్ లో సీట్ వచ్చిందని, లేదా మీరు సెలవులలో విదేశాలకు వెళ్తున్నారని ఇలా ఏమైనా కావచ్చు. యోసేపు సహోదరులు ఇలాగే ఒక వార్త తెలిసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ వార్త ఏమిటో మీకు గుర్తుందా? యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు!

గతవారము
20 సంవత్సరముల క్రిందట తనకు చేసిన కీడును గూర్చి తన సహోదరులు పశ్చాత్తాప పడుతున్నారు అనే విషయం యోసేపు ఎలా గ్రహించగలిగాడు? యోసేపు తన సహోదరులకు తనను తాను తెలియపరచుకున్నాడు. వారికి అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అతడు నిజముగా యోసేపు అని వారు తెలుసుకున్నారు.

యోసేపు మరణించి ఉంటాడు అని వారు అనుకుని ఉండవచ్చు. యోసేపు ఐగుప్తులో అంత గొప్ప స్థానములో ఉంటాడు అని వారు ఊహించలేదు. యోసేపు వారికి ఏమి చేశాడు? వారు ఎంతగానో భయపడ్డారు కాని యోసేపు వారిని క్షమించి చేరదీశాడు. వారు తన విషయంలో క్రూరంగా ప్రవర్తించినప్పటికిని, దేవుడు ఒక ప్రణాళికతో తనను ఐగుప్తులో ఉంచాడు అని వారికి చెప్పాడు. కరువు నిండిన ఏడు సంవత్సరములు వారిని యోసేపు చూసుకొనబోతున్నాడు.

సమస్తము దేవుడు తన ఆధీనములో ఉంచుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! యోసేపు తన సహోదరుల విషయములో పగ తీర్చుకొని కఠినంగా ఉండాలి అని అనుకోలేదు. వారు మారారు అనే విషయం తెలిసిన వెంటనే యోసేపు వారిని సంతోషంగా క్షమించగలిగాడు.

యోసేపు తన తండ్రి కొరకు సహోదరులను పంపుట

తన సహోదరులను కలుసుకున్నందుకు యోసేపు ఎంతో సంతోషించాడు. సంతోషముతో ఏడుస్తూ వారిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. యోసేపుకు ఎవరిని చూడాలి అని ఆశ కలిగిందో తెలుసా! తన తండ్రిని చూడాలని ఆశ పడ్డాడు. తన సహోదరులను తండ్రి దగ్గరకు వెళ్లి తాను బ్రతికి ఉన్నానని, ఐగుప్తు దేశమంతటిపై అధికారిగా ఉన్నాను అని తెలియజేయ మన్నాడు. తన తండ్రితో - "అక్కడ ఉండవద్దు నా యొద్దకు రమ్ము మనము కలిసి నివసింపవచ్చు" అని చెప్పమని సహోదరులను కోరాడు.

జరిగిన విషయాలు తెలిసికొనిన ఫరో యోసేపు తన వారితో కలుసుకొనుట చూచి ఎంతో సంతోషించాడు. అప్పుడు ఫరో యోసేపుతో - ``నీవు నీ సహోదరులను చూచి మీరీలాగు చేయుడి. మీరు కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీ కిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు" అని చెప్పమన్నాడు. యోసేపు ఫరో చెప్పిన విధముగా వారికి బండ్లను, మార్గమునకు ఆహారమును రెండేసి దుస్తుల బట్టలను ఇచ్చాడు. బెన్యామీనుకు ఐదు జతల దుస్తులను ఒక వెండిగిన్నెను కానుకగా ఇచ్చాడు. యోసేపు తన తండ్రి కొరకు ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను

తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారాలను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపాడు. త్వరగా వెళ్ళి తన తండ్రిని తీసుకొని వచ్చునట్లు సహోదరులను పంపించాడు.

వారు ప్రయాణములో ఏమి మాట్లాడుకొని ఉండవచ్చు? యోసేపును కలవడం వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. తమ తండ్రికి యోసేపు గురించి చెప్తే ఏ విధంగా స్పందిస్తాడు? తాము యోసేపుకు చేసిన హాని గురించి ఇప్పుడు తండ్రికి చెప్పవలసిన పరిస్థితులు కలిగాయి. అది వారికి ఎంతో బాధను, భయాన్ని కలిగించింది. వారు చేసినది క్షమించమని అడుగగలిగిన చిన్న పొరపాటు ఏమీకాదు.

యాకోబుకు యోసేపును గూర్చిన వివరాలు తెలియుట

వారు తమ తండ్రి దగ్గరకు చేరుకున్నారు. కుమారులందరు క్షేమంగా తిరిగి రావడం చూచిన యాకోబు ఎంతో సంతోషించి ఉంటాడు. వారు తమ తండ్రికి యోసేపును గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారు యాకోబుతో - `` యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుతున్నాడు" అని చెప్పారు. యోసేపు చనిపోయాడు అనే నమ్మకంతో యాకోబు ఉన్నాడు కనుక వారి మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయాడు. యోసేపు జీవించి ఉన్నాడు అన్న విషయం అతనికి నిజము అనిపించలేదు. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని యాకోబుతో చెప్పారు. తాము యోసేపుకు చేసిన కీడు గురించి కూడా వారు తమ తండ్రికి చెప్పి ఉండవచ్చు. తాము చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడుతున్నట్లుగా కూడా వారు చెప్పి ఉండవచ్చు. తనను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచిన తరువాత యాకోబు వారి మాటలు నమ్మాడు. అప్పుడు యాకోబు -"ఇంతే చాలును. నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి యున్నాడు. నేను చావక మునుపు వెళ్లి అతని చూచెదను" అని చెప్పాడు.

యోసేపు, యాకోబు కలుసుకొనుట

యాకోబు తనకు ఎంతో ప్రియమైన కుమారుని చూడబోతున్నాడు. వారు ఐగుప్తు దేశము సమీపమునకు రాగానే యూదా వారికి ముందుగా వెళ్ళి యోసేపుతో యాకోబు వస్తున్న విషయాన్ని తెలిపాడు. అప్పుడు యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రిని కలిసి కొనుటకు వెళ్ళాడు. తండ్రి దగ్గరకు రాగానే యోసేపు అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎంతో ఏడ్చాడు. వారిరువురూ సంతోషంతో ఏడవసాగారు. 20 సంవత్సరముల తరువాత వారు తిరిగి కలుసుకున్నారు. మీరు ఎప్పుడైనా సంతోషంతో ఏడ్చారా? తాము తిరిగి కలుసుకునేలా చేసినందుకు వారిద్దరూ ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు. అప్పుడు యాకోబు యోసేపుతో - " నీవింక బ్రతికి ఉన్నావు. నీ ముఖము చూచితిని గనుక నేనికను చని పోవుదును" అని చెప్పాడు. వారి సంతోషము చూచి యోసేపు సహోదరులు ఎంతగానో చింతించి ఉండవచ్చు. యోసేపుకు తాము చేసిన కీడు గుర్తు చేసుకుని తిరిగి పశ్చాత్తాప పడి ఉండవచ్చు. యోసేపు దేవుని విశ్వసించాడు గనుక దేవుడు యోసేపును అద్భుతంగా వాడుకున్నాడు.

యాకోబు కుటుంబము ఐగుప్తులో స్థిరపడుట
యోసేపు తండ్రి, మిగిలిన కుటుంబము కలసి 70 మంది ఐగుప్తుకు వచ్చారు. తరువాత వారందరూ ఐగుప్తులోని గోషెను అనే ప్రాంతానికి వెళ్లారు. అది ఎంతో మంచి ప్రదేశం. అక్కడ వారు తమ వస్తువులు దించుకొని నివసించసాగారు. యోసేపు తన తండ్రికి, తన సహోదరులు, తన తండ్రి కుటుంబపు వారందరికి ఆహారము ఇచ్చి సంరక్షించాడు.

యాకోబు ఐగుప్తు చేరిన తరువాత ఇంక 17 సంవత్సరాలు జీవించాడు. యాకోబు, యోసేపు 17 సంవత్సరాలు కలిసి దగ్గరగా ఉన్నారు. యాకోబు 147 సంవత్సరముల వయస్సులో మరణించాడు. యాకోబు మరణించినప్పుడు యోసేపు అతని సహోదరులు ఎంతగానో దుఃఖించారు. తమ తండ్రిని పాతిపెట్టుటకు వారందరు కనాను దేశం వెళ్లారు. యోసేపు సహోదరులు యాకోబు మరణించుట చూచి యోసేపు తమ మీద పగతో అతనికి చేసిన కీడు చొప్పున తమకు కూడా చేస్తాడు అని భయపడ్డారు. యోసేపు తిరిగి వారితో - "భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా. మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి, కాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నేను మిమ్మును, మీ పిల్లలను పోషించెదను" అని వారితో చెప్పాడు. యోసేపు తన జీవితమంతా దేవుని పై విశ్వాసముంచినవాడు. తండ్రి మరణించినప్పటికి తన సహోదరులపై పగ తీర్చుకోవాలి అనే ఆలోచన యోసేపు కు రాలేదు.

యోసేపు మరణించుట

యోసేపు నూట పది సంవత్సరముల వయస్సులో మరణించాడు. తన జీవితములో ప్రతి పరిస్థితులలో తోడుగా ఉన్న దేవునిపై యోసేపు విశ్వాసముంచాడు. మరణించుటకు ముందు యోసేపు తన సహోదరులతో - "నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను" అని వారి చేత ప్రమాణము చేయించుకున్నాడు ( హెబ్రీ 11:22).

సందేశము
యోసేపు జీవితము మొదట అంతా ఎన్నో కష్టాలతో గడిచిపోయింది. అతని సహోదరులు కపటముతో యోసేపును 20 వెండి నాణెములకు అమ్మివేసి తండ్రికి దూరం చేశారు. యోసేపు బానిసగా ఐగుప్తులోనికి తీసుకొని పోబడ్డాడు. పోతీఫరు భార్య మాట విని ప్రభువుకు వ్యతిరేకముగా పాపము చేయనందువలన యోసేపు ఎన్నో సంవత్సరాలు చెరసాలలో ఉండవలసి వచ్చింది. కానీ ఈ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువు యోసేపుతో ఉన్నాడు అని మనము చూశాము. ప్రభువు యోసేపుకు ఎన్నో విషయాలు నేర్పించాడు. దేవుడు యోసేపు పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి తగిన సమయములో ఐగుప్తు దేశమంతటిపై అధికారిగా హెచ్చించాడు. యోసేపు సహోదరులు ఆహారము కొరకు వచ్చినప్పుడు అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుడు యోసేపుకు చిన్న వయస్సులో చూపిన కలలు నెరవేరాయి. యోసేపు తన తండ్రిని కలిసికొని ఎంతో సంతోషించినట్లు చూశాము . తన తండ్రి కుటుంబపు వారందరు కలిసి ఐగుప్తులో నివసించసాగారు. కరవు సమయంలో తన కుటుంబపు వారందరిని కాపాడు కొనునట్లు ప్రభువు ముందుగా తనను ఐగుప్తుకు పంపి,వారిపై అధికారిగా నియమించాడు అని యోసేపు గ్రహించాడు. కరవు సమయములో తన కుటుంబపు వారెవ్వరు మరణించకుండా యోసేపును దేవుడు నియమించాడు. యాకోబు సంతతివారు అభివృద్ధి పొంది విస్తరించినట్లు దేవుడు తన ప్రణాళికను యోసేపు ద్వారా నెరవేర్చాడు( కీర్తనలు 105:16-24).

అన్వయింపు
ప్రతి క్రైస్తవుని జీవితము పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. క్రైస్తవులు తమకు జీవితములో ఎదురైన కష్టాలను కూడా ప్రభువు ఏ రీతిగా మేలు కలుగునట్లు మార్చివేసింది గుర్తు చేసుకుంటారు. నీవు క్రైస్తవుడ వైతే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అనే విషయం మరిచి పోకూడదు. ఎంతో కష్టమైన పరిస్థితులు మీకు కలుగవచ్చు, మీకు అనుకోని ఆపద ఎదురుకావచ్చు, స్కూల్ లో స్నేహితులు లేకపోవచ్చు, అనారోగ్యం కలుగవచ్చు, దానిద్వారా ఎంతో దుఃఖానికి గురికావచ్చు. మీరు ప్రభువును విశ్వసించి నట్లయితే అయన మీ బాధను పూర్తిగా అర్థం చేసుకొనగలడు. వాటిని గురించి దుఃఖించకుండా ప్రభువుకు ప్రార్థించండి. చెరసాలలో ఉన్న యోసేపును గురించి ఆలోచించండి. ఎంతో కష్టంగా ఉన్నా ప్రభువు నందు విశ్వాసముంచి సహనముతో ఉన్నాడు. మీరు కూడా ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరిస్తే మీ కష్టాలలో కూడా ప్రభువు మీతో ఉంటాడు. అలాంటి కష్టాలు మీకు ఎందుకు కలిగాయో అర్థం చేసుకోవడానికి సహాయము చేస్తాడు. మీరు ప్రభువును ప్రేమించి విశ్వాసముంచిన యెడల మీ జీవితం పట్ల ఆయన ప్రణాళికను అర్థం చేసుకుంటారు.

కంఠతవాక్యము
దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ( రోమా 8: 28).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.