సండే స్కూల్ పాఠాలు

 యెహోషువ 5:13-6:27;హెబ్రీ 11:30,31

ఉద్దేశము
నాశనము నుండి తప్పించు కొను మార్గము ఒక్కటే అని బోధించుట.

ముఖ్యాంశము
మీరు క్రొత్త స్కూల్ లో చేరుతున్నారు అనుకొందాము. మీకు అప్పటి వరకు ఆ స్కూల్ గురించి ఏమీ తెలియదు. అందరూ క్రొత్తవారు! అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా భయంగా ఉంటుంది కానీ ఆ రోజే మీ పాత స్నేహితుడు ఫోన్ చేసి తాను కూడా ఆ స్కూల్ లోనే మీ క్లాస్ లోనే చదువుతున్నాను అని చెప్పాడు అనుకుందాము. అంతేకాకుండా ఏమీ భయపడవద్దని, స్కూల్ లో అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు చూసుకుంటాను అని మీకు చెప్తే ఎలా ఉంటుంది? మీ భయాలన్నీ తొలగిపోతాయి. మీకు తోడుగా ఒక స్నేహితుడు ఉన్నాడు గనుక స్కూల్ కి వెళ్ళటానికి అంతవరకు ఉన్న భయము తొలగిపోయి ధైర్యం వస్తుంది కదూ!

యెహోషువ క్రొత్తగా ఏర్పరచబడిన నాయకుడు గనుక కనాను దేశమును స్వాధీనపరచు కోవడానికి ముందు భయపడ్డాడు కానీ ఆ పరిస్థితులలో తోడుగా ఉంటూ తనతో పాటు ఆ యుద్ధములలో పాల్గొంటాను అని ఒకరు ఎంతో ధైర్యం చెప్పారు.

గతవారము
ఎండిన నేల మీద నడిచినట్లు ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశములోనికి ప్రవేశించారు. అక్కడ నివసించడానికి ముందుగా వారు ఆ ప్రాంతములను జయించి స్వాధీనపరచుకొని వలసి ఉంది. యెరికో పట్టణమును వేగు చూచుటకు యెహోషువ ఇద్దరు వేగుల వారిని పంపినట్లు మనము చూసాము. రాజు వారిని బంధించి చంపకుండునట్లు వారిని దాచిపెట్టిన స్త్రీ ఎవరు?

వారికి చేసిన ఉపకారములకు ప్రతిఫలంగా ఆ వేగులవారు రాహేలుకు చేసిన వాగ్దానం ఏమిటి? ఆమె కుటుంబం క్షేమముగా ఉండుటకు వారు చేయవలసిన పని ఏమిటి? ఆమె తన ఇంటి కిటికి ద్వారమునకు దారం కట్టి దానిని క్రిందకు వేయాలి. ఇశ్రాయేలీయులు యెరికోను నాశనము చేయుటకు వచ్చినప్పుడు ఆ దారము చూచి రాహేలు కుటుంబమును నాశనం చేయకుండా కాపాడుతారు.

యెరికో పట్టణము
ఇశ్రాయేలీయులు తమకు కలిగిన సమస్తము తీసికొని యొర్దాను నదికి, యెరికో పట్టణమునకు మధ్య గిల్గాలు అనే ప్రాంతంలో దిగారు. వారికి యెరికో పట్టణం చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని తాము చేయించవలసిన మొదటి పట్టణం అని వారికి తెలుసు. యెరికో పట్టణపు ప్రాకారము ఎత్తుగా, ఎంతో గట్టిగా ఉండేది. దాని చుట్టూ గట్టి తలుపులతో పట్టణము శత్రువులు రావడానికి వీలు లేకుండా మూయబడి ఉండేది. ఎంత గొప్ప సైన్యము అయినప్పటికి ప్రాకారములు దాటి యెరికో పట్టణము లోపల ప్రవేశించడం అసాధ్యమైన పనిగా ఉండేది.

యెరికో పట్టణమును వేగు జూచి వచ్చినవారు - దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీయులను నడిపించిన గొప్ప కార్యము యెరికో పట్టణస్తులకు వినబడింది కనుక యెరికో ప్రజలు భయంతో ఉన్నారు" అని చెప్పారు. వారు ఎంతో భయపడి నప్పటికి రాహాబు వలె జీవముగల దేవుని యందు విశ్వాసము లేదు. ఒకవేళ వారు దేవుని విశ్వసించి నట్లయితే రాహాబు వలె నాశనం కాకుండా తప్పించుకుని ఉండేవారు. కనాను దేశం ఎంతో క్రూరమైన పనులు చేస్తూ దేవునికి ఎంతగానో కోపం తెప్పించే వారు. దేవుడు యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయుల ద్వారా యెరికో పట్టణమును నాశనము చేయబోతున్నాడు.

యెహోషువ ప్రభువును కలుసుకొనుట
యెహోషువ యెరికో ప్రాంతమును చూచుటకు వెళ్ళాడు. అంత గొప్ప పట్టణమును ఎలా జయించ గలము అని యెహోషువ భయపడి ఉండవచ్చు. దేవుడు తమతో ఉంటాడు అని యెహోషువ విశ్వసించాడు కానీ ఆ పట్టణమును ఏ విధముగా స్వాధీనపరచుకొనగలము అని భయపడ సాగాడు. యెహోషువ తన కన్నులెత్తి చూచినప్పుడు దూసిన కత్తిని చేతిలో పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడు యెహోషువ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి - "నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్న వాడవా"? అని ప్రశ్నించాడు. అందుకు అతడు - "కాదు ప్రభువు సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను" అని చెప్పాడు. తమ శత్రువులపై ఇశ్రాయేలీయులు చేయబోవు యుద్ధమునకు సేనాధిపతిగా ఉండబో తున్నాను అని అతడు చెప్పాడు. యెరికో వారితో ఆ వ్యక్తి యుద్ధము చేయబోతున్నాడు అని యెహోషువ విన్నాడు. తనతో మాట్లాడినది ప్రభువే అని యెహోషువ గుర్తించాడు కనుక తాను కాదు గాని తమ పక్షముగా యుద్ధము చేయబోతున్నది దేవుడే అని యెహోషువ గ్రహించాడు. జరుగబోవు యుద్ధము గురించి దేవుడు యెహోషువకు సూచనలు ఇవ్వబోతున్నాడు. యెహోషువ లోని భయం అంతా మాయమైపోయి ఉండవచ్చు. అన్నింటిని ప్రభువు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు గనుక తాను భయపడవలసిన అవసరం లేదు అని యెహోషువ గ్రహించాడు. యెహోషువ నేలమీద సాగిలపడి ఆ వ్యక్తికి నమస్కారం చేశాడు. యెహోషువ తాను మానవుడని గుర్తించి ఎంతగానో తగ్గించుకొని విధేయత చూపించాడు.

పట్టణపు ప్రాకారము చుట్టు తిరుగుట
యెరికో పట్టణమును స్వాధీనపరచుకొనుటకు చేయవలసిన దానిని ప్రభువు యెహోషువకు వివరించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ప్రతిరోజు ఒక్కసారి పట్టణ ప్రాకారము చుట్టూ తిరగాలి. ఆ విధముగా ఆరు దినములు తిరిగిన తరువాత ఏడవ దినమున ఏడుమారులు తిరిగిన తరువాత యెరికో పట్టణపు గోడలు కూలుతాయి అని ప్రభువు చెప్పాడు. యెహోషువ, ఇశ్రాయేలీయులు ప్రభువు చెప్పిన మాటలు విశ్వసించి ఆ విధముగా చేయుటకు సిద్ధపడ్డారు (హెబ్రీ 11:30)

యాజకులను నిబంధన మందసము ఎత్తికొని మోయుమని యెహోషువ చెప్పాడు. యొర్దాను నది దాటు సమయములో కూడా యాజకులు ముందుగా నిబంధన మందసము తీసుకొని నదిలో నిలువబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా! ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలు కొమ్ము బూరలను ఊదుచు నిబంధన మందసమునకు ముందుగా నడవాలి. సైనికులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచారు. మందసము వెంట కూడా మరి కొందరు యోధులు ఉన్నారు. గొప్ప సమూహముగా వారు సాగారు - మొదట యోధులు, బూరలను ఊదు యాజకులు నిబంధన మందసము మోయు యాజకులు, మరల యోధులు చివరగా ప్రజలు. ఈ క్రమములో వారు సాగి పోవునట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆరు దినములు పట్టణం చుట్టూ తిరుగు చున్నప్పుడు నిశ్శబ్దముగా ఉండాలి అని యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. ఆ విధముగా ఆరు దినములు పట్టణము చుట్టు ఒకమారు తిరిగిన తరువాత వారు తమ పాళెమునకు వచ్చి గుడారములలో ఉండేవారు.

యెరికో గోడలు కూలి పోవుట
ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి పట్టణము చుట్టూ తిరుగుటకు మొదలుపెట్టారు. కాని ఆరోజు ఒకసారి కాదు గాని ఏడు సార్లు తిరుగునట్లు దేవుడు ఆజ్ఞా పించాడు. ఏడవమారు యాజకులు బూరలు ఊదాగా యెహోషువ జనులకు - "కేకలు వేయుడి ప్రభువు ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు" అని ఆజ్ఞాపించాడు. ప్రజలు గొప్ప శబ్దముతో కేకలు వేశారు. అప్పుడు ఏమి జరిగింది అనుకుంటున్నారు? యెరికో పట్టణపు ప్రాకారము కూలిపోయింది. ఇశ్రాయేలీయులు వేసిన కేకలు వలన ప్రకారము కూలిపోయిందా? కాదు గదా! దేవుని అద్భుతమైన శక్తి ఆ ప్రాకారమును కూల్చి వేసింది. యెరికో గోడలు కూలిపోతాయి అని దేవుడు చెప్పిన మాటలను యెహోషువ ఇశ్రాయేలీయులు విశ్వసించారు కాని ఇప్పుడు కనులారా చూశారు. దేవుడు ఎంతో శక్తిమంతుడు గనుక ఏదైనా చేయగల సమర్ధుడు, సృష్టి కర్త గనుక సమస్తము తన ఆధీనంలో ఉంచుకొనగలడు.

రాహాబు తప్పించబడుట
యెరికో ప్రాకారము కూలిన వెంటనే ప్రజలందరు ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకున్నారు . వారు పురుషులను, స్త్రీలను చిన్న వారిని పెద్దవారిని పశువులను సమస్తాన్ని కత్తితో చంపేశారు. ఒక్క కుటుంబం మాత్రమే అక్కడ తప్పించుకొనగలిగింది. ఆ కుటుంబం ఎవరిది? అవును రాహాబుది. వేగులవారు ప్రమాణము చేసినట్లు రాహాబు తన ఇంటి కిటికి ద్వారమునకు ఎర్రని దారం కట్టి ఉంచింది. యెరికో పట్టణపు ప్రాకార మంతయు కూలి నప్పటికి రాహాబు ఇల్లు ఉన్న చోట మాత్రమే ప్రాకారము కూలి పోలేదు. యెహోషువ రాహాబు ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబమును వెలుపలికి తీసుకొని వచ్చునట్లు ఆ ఇద్దరి వేగుల వారికి ఆజ్ఞా పించాడు. వారు రాహాబును, ఆమె కుటుంబపు వారిని వెలుపలకు తీసికొని వచ్చి తమ పాళెములో క్షేమముగా ఉంచారు. దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే ఉంచి ఆ పట్టణమును దానిలోని సమస్తాన్ని అగ్నితో కాల్చివేశారు. తరువాత యెరికో పట్టణమును ఎన్నడూ ఎవరూ కట్టించ కూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.

సందేశము
యెరికో ప్రాకారము కూలిపోతుంది అని దేవుడు చెప్పిన మాటలను ఇశ్రాయేలీయులు నమ్మారు. దానినే విశ్వాసము అంటారు (హెబ్రీ 11: 30). దేవుని మాటలు అన్నింటిని విశ్వసించాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాము.

రాహాబు చెడుతనము జరిగించిన స్త్రీ అయిప్పటికి, జీవము గల దేవుని గురించి తెలిసిన వెంటనే విశ్వాసముంచింది. రాహాబు తన జీవితమును మార్చుకుని దేవుని మార్గములయందు నడచుటకు ఇష్టపడింది. వేగులవారు ఇద్దరిని దాచిపెట్టి, దేవుడు వారికి తప్పక విజయము కలుగ జేస్తాడు అని నమ్మింది (హెబ్రీ 11:31). ఎర్రని దారము తన ఇంటి కిటికీ కి కట్టి, వేగులవారు ప్రమాణము చేసినట్లుగా ఆ నాశనం నుండి తనను తన కుటుంబమును కాపాడుకొన గలిగింది. రాహాబు దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా యెరికో పట్టణమునకు కలిగిన నాశనము నుండి తప్పించుకొన గలిగింది.

అన్వయింపు

మనము కూడా రాహాబు వలె చెడుతనము తో నిండిన హృదయలు గల వారమే. మన పొరపాట్లు వేరుగా ఉండవచ్చు. ఎన్నోసార్లు అల్లరి పనులు చేస్తూ దేవునికి అవిధేయత చూపిస్తుంటాము. మనలో ఈర్ష్య, ద్వేషము, స్వార్థము, అహంకారము ఇలా ఎన్నో చెడు గుణాలు ఉంటాయి. మనము కొన్ని సార్లు అబద్ధాలు చెప్తుంటాము. చిన్న చిన్న దొంగ పనులు చేస్తుంటాము. ప్రభువైన యేసు మరల ఒక దినము వచ్చి అందరికి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చి భూమిని అగ్నితో కాల్చి వేస్తాడు అని బైబిల్ లో వ్రాయబడింది ( 2 పేతురు 3:10). ప్రభువైన యేసు నందు విశ్వాసముంచిన వారు మాత్రమే ఆ ఉగ్రతను తీర్పును తప్పించుకొన గలరు. రాహాబు వలె ఎర్రని దారమును మన కిటికీ కి కట్టనవసరం లేదు కాని, దేవుని వాగ్దానములు విశ్వసించాలి. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షింపబడుదువు అని బైబిల్ లో స్పష్టంగా ఉంది. మన పాపములను క్షమించి, మన జీవితాన్ని మార్చమని దేవునికి ప్రార్థించాలి. యేసును ప్రేమించి మన జీవితాలలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనము క్షేమముగా ఉండగలము. అప్పుడు దేవుని తీర్పు ను గూర్చిన భయము మనలో ఉండదు.

యెరికో పట్టణపు వారు తమకు గల ఎత్తయిన ప్రాకారములు, దేవతలను బట్టి ఎంతో ధైర్యంగా ఉండి ఉండవచ్చు. కాని వారు నశించి పోయారు. దేవుని వాగ్దానముల యందు విశ్వాసముంచిన రాహాబు తన కుటుంబమును కూడా రక్షించు కొనగలిగింది. పరలోకమునకు మార్గము ఒక్కటే అని బైబిల్ బోధిస్తుంది. మనము చేసే మంచి పనులు మనలను కాపాడలేవు. యేసు నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే మనము నాశనము కాకుండా తప్పించుకొన గలము.

కంఠతవాక్యము
యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని మరి ఏ నామమున రక్షణ పొందలేము. (అ.కార్య. 4:12)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.