Hits: 195
Print
రచయిత: ఆర్థర్ డబ్ల్యు పింక్
అనువాదం: జి థామస్ కాంతయ్య

దేవుడు తన ప్రజలలో తన కృపాకార్యం ప్రారంభించిన తర్వాత ఈ లోకంలో వారిని ధన్యులుగా చెయ్యగలిగేది ఏంటని వాక్యాధారమైన నా సమగ్ర అభిప్రాయాన్ని ఆడిగితే మహిమగల త్రిత్వంలోని వ్యక్తులను గురించిన వ్యక్తిగత జాసు మరియు సహవాసంపై అది ఆధారపడి ఉంటుందని జవాబు చెప్పడానికి సంకోచించను - ఈ లోక జీవితం ముగిసాక, మహిమలో దేవునితో ఎడతెగని సహవాసంలో నిత్యం పరిశుద్ధంగానూ సంతోషంగానూ ఉండటానికి సంఘం ఏర్పరచబడింది కాబట్టి, విశ్వాసంతో దానికొరకు కనిపెట్టడమే ప్రస్తుతమున్న సకల సంతోషాలకు స్వచ్చమైన మూలాధారమై ఉండాలి. అయితే త్రిత్వమైయున్న దేవుని గురించిన స్పష్టమైన అవగాహన లేకుండా ఆయనతో ఈ సహవాసం అనుభవించడం సాధ్యం కాదు. త్రిత్వంలోని ప్రతివ్యక్తితో సహవాసం కలిగి ఉండటానికి ముందుగా మనం ముగ్గురు వ్యక్తులుగా ఉన్న త్రియేక దేవుని గురించి, దైవత్వంలోని మహిమగల ప్రతి వ్యక్తి తనను తాను తన ప్రజలకు బయలుపర్చుకోవడానికి చేసిన ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన కృపాకార్యాలను గురించి దైవోపదేశం ద్వారా తెలుసుకొని ఉండటం అవసరం.

అలాగైతే పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని గురించి ధ్యానించడానికి పూర్తిగా ఒక వ్యాసాన్ని ప్రత్యేకంగా కేటాయించినందుకు నేను బాధపడటం లేదు. ఎందుకంటే మహిమగల ఆయన ఉనికిని గురించి మనం సరైన అవగాహన కలిగుంటేనే తప్ప, ఆయనను గురించిన సరైన ఆలోచనలు కలిగియుండటం అసాధ్యం. అలాగే ఆయనకు చెందాల్సిన ఘనత, ప్రేమ, నమ్మకం మరియు విధేయతను చెల్లించడం కూడా అసాధ్యమౌతుంది. తిరిగి జన్మించిన తొలి క్షణం మొదలుకొని మహిమలో పొందే సంపూర్ణసిద్ది వరకూ తనపై కార్యం చేసే దైవికమైన ప్రతి ప్రభావానికి తాను పరిశుద్ధాత్మకే వ్యక్తిగతంగా రుణపడి ఉన్నాడని అర్థం చేసుకునే ఏ క్రైస్తవుడైనా పరిమితిగల తన మేథాశక్తికి సాధమయ్యేంతగా ఆయనను తెలుసుకోవాలని ఆకాంక్షించడం ప్రాముఖ్యం కాదని భావించలేడు - ఔను, ఎవరి దైవికమైన కృప మరియు శక్తి, క్రీస్తులో లభించే రక్షణకు సార్థకమైన సాధనంగా కార్యం చేస్తుందో ఆయనను గురించిన ఆత్మీయజ్ఞానాన్ని సంపాదించడానికి ఎంతటి ప్రయాసమైనా అది అత్యధికమైనదిగా అతడు భావించడు. అయితే ధన్యకరమైన పరిశుద్ధాత్మ హృదయంలో జరిగించే కార్యాలకు అపరిచితులైయున్నవారికి, ఈ వ్యాసంలో ఉన్న అంశం అనవసరమైందిగానూ దాని వివరాలు విసుగుపుట్టించేవిగానూ ఉండవచ్చు. 

అలంకారికమా లేక అక్షరార్థమా?

తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారిలో పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించేవారు ఉన్నారని తెలుసుకుని పాఠకులలో కొందరు ఆశ్చర్యపడవచ్చు. వారి దేవదూషణలను పేర్కోవడం ద్వారా ఈ పుటలను కళంకపర్చడానికి నేను ఇష్టపడటం లేదు, కానీ అలాంటి దుర్బోధకులు వినియోగిస్తున్న ఒక వివరాన్ని పేర్కోవాలని మాత్రం నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే నా స్నేహితులలో కొందరు ఈ విషయంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనియుండవచ్చు. అపొస్తలుల కార్యములు 2 : 18:లో పరిశుద్ధాత్మను “కుమ్మరించెదను” మరియుఅపొస్తలుల కార్యములు 2 : 33: లో పరిశుద్ధాత్మను " కుమ్మరించి యున్నాడు” అని చెప్పబడియుంది.

ఒక వ్యక్తి గురించి ఇలాంటి పదాలు వాడటం ఎలా సాధ్యం? అది చాలా సులభం: ఈ భాష అలంకారికమైనదే తప్ప అక్షరార్థమైనది కాదు; అది అక్షరార్థమైనదైయుండటం వీలుపడదు, ఎందుకంటే ఆధ్యాత్మికమైనది భౌతికంగా “కుమ్మరించబడటం” సాధ్యం కాదు. ఈ అలంకారాన్ని ఆర్థం చేసుకోవడం సులభమే. ఏవిధంగా "కుమ్మరించబడిన" నీళ్ళు క్రిందికి దిగి వస్తాయో అలాగే పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఇహలోకానికి దిగి వచ్చాడని, ఏవిధంగా ప్రచండ వర్షం భారీగా కురుస్తుందో అదేవిధంగా పరిశుద్ధాత్మ తన వరాల సమృద్ధిలో ఉచితంగా అనుగ్రహించబడ్డాడని ఆ అలంకారానికి భావం.

పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని తెలియచేసే ముఖ్య కోణాలు

పరిశుద్ధాత్మ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా లేవనెత్తబడిన పై అభ్యంతరాన్ని తొలగించుకున్నాము కాబట్టి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని రూఢిపరచే కొన్ని ఆధారాలను పరిశీలించి తెలుసుకుందాం. ఒక "వ్యక్తి"  బుద్ధిసూక్ష్మతగలవాడు మరియు స్వచ్ఛందమైన చిత్తముగలవాడై ఉన్నాడని సూచించడంతో మొదలుపెడుతున్నాను, అతడు వ్యక్తిత్వలక్షణాలన్ని నిజంగా కలిగి ఉండాలి. ఒక "వ్యక్తి”, గ్రహింపు మరియు చిత్తవృత్తి గలవాడును, సజీవుడైన అస్తిత్వంగలవాడును, నిర్ణయ స్వేఛ్చగలవాడును అయ్యియుండాలి. పరిశుద్ధాత్మలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి: ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకు ఆపాదించబడ్డాయి, అవి ఆయనలో స్పష్టంగా కనిపిస్తాయి.

“తండ్రి తన యందు జీవం కలిగియున్న ప్రకారం, మరియు కుమారుడు తన యందు జీవం కలిగియున్న ప్రకారం, పరిశుద్ధాత్మ కూడ జీవం కలిగియున్నాడు: ఎందుకంటే మానవుల భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవానికీ కర్త ఆయనే ఆయనలో జీవముంటేనే తప్ప ఆయన జీవానికి కర్తయై ఉండజాలడు; ఆయనలో జీవమున్నట్లయితే ఆయన తనంతట తాను ఉనికి గలవాడై ఉండాలి” (జాన్ గిల్).

ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలన్నీ పరిశుద్ధాత్మకు ఆపాదించబడ్డాయి. ఆయనకు గ్రహణశక్తి లేక జ్ఞానం ఆపాదించబడింది. ఇది ఒక వ్యక్తి నుండి వేరుచెయ్యలేని ప్రథమ లక్షణం. “ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు” (1 కొరింథీ 2:10). “పరిశోధించుట” అనేది గ్రహణశక్తికి సంబంధించిన చర్య. ఈ పరిశోధనకు అవసరమైన జ్ఞానం కూడా ఆయనకు ఆపాదించబడింది (వ 11). ఆయనకు చిత్తము ఆపాదించబడింది. ఇది ఒక వ్యక్తికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణం. “అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు” (1 కొరింథీ 12:11) - పరిశుద్ధాత్మ ఒక ప్రభావం మాత్రమే లేదా ఒక శక్తి మాత్రమే అయ్యుంటే ఈ మాటలు బొత్తిగా అర్థంలేనివై ఉండేవి కదా! అదేవిధంగా ఆయనకు భావోద్రేకాలు కూడా ఆపాదించబడ్డాయి.  ఆయన ప్రేమిస్తాడు: “సహెూదరులారా, ... మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను” రోమా 15:30-32: - పరిశుద్ధాత్మ వ్యక్తిత్వంలేని ఊపిరి లేక నిర్గుణమైన శక్తి మాత్రమే అయ్యుంటే “ఆత్మవలని ప్రేమ” అని చెప్పడం ఎంత హేతువిరుద్ధమైనదై ఉండేది కదా!

పరిశుద్ధాత్మకు వ్యక్తిత్వపు నిష్క్రియ లక్షణాలు ఆపాదించబడ్డాయి: అనగా ఒక వ్యక్తి మాత్రమే అనుభవించగలిగే మానవ క్రియలను ఆయన అనుభవిస్తాడు. ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? (అపొ. 5:9) -  “దేవుని యొక్క లక్షణం, ఒక అంశం లేదా ఒక ప్రభావం శోధించబడటం ఎలా సాధ్యమౌతుంది? ప్రతిపాదించబడిన విషయం గురించి ఆలోచించడానికి అవసరమైన గ్రహణశక్తి మరియు ప్రతిపాదించబడినవాటిని నిర్ణయించగలిగే చిత్తం కలిగున్న ఒక వ్యక్తికి తప్ప శోధించబడటం సాధ్యం కాదు” అంటూ జాన్ ఓవెన్ యుక్తంగా పలికాడు. అదేవిధంగా అననీయ, “పరిశుద్ధాత్మతో అబద్ధమాడాడు" అని చెప్పబడింది అపొ 5:3-4 - వినడానికి, విన్నదానికి సంబంధించిన సాక్ష్యాన్ని అంగీకరించడానికిని సామర్థ్యంగలవానితో తప్ప, ఎవరును అబద్దమాడలేరు. మనము “దేవుని పరిశుద్ధాత్మను దు:ఖపరచకూడదని” ఎఫెసీ 4:30లో హెచ్చరించబడింది - ఒకవేళ "దు:ఖపర్చకుడి” అనే మాట, వ్యక్తి కాని ఒకదానిని, ఉదా|| గురుత్వాకర్షణ శక్తి వంటి అమూర్తమైన ఒక దానిని గురించి చెప్పి వుంటే అది ఎంత అర్ధరహితమైయుండేది! పరిశుద్ధాత్మ “తిరస్కరింపబడవచ్చునని" కూడా మనలను హెబ్రీ 10:29 : హెచ్చరిస్తుంది.

ఒక వ్యక్తి మాత్రమే చెయ్యగలిగే కార్యాలు ఆయనకు ఆపాదించబడ్డాయి. ఆయన మాటలాడతాడు: "ఆత్మ తేటగా చెప్పుచున్నాడు” 1 తిమోతి 4:1-2 ; “చెవిగలవాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక" (ప్రకటన 2:7). ఆయన ఉపదేశిస్తాడు: “మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును” (లూకా 12:12); “పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును” (యోహాను 14:26). ఆయన ఆజ్ఞాపిస్తాడు, అధికారాన్ని వినియోగిస్తాడు. దీనికి రుజువు అపొ. 13:2లో కొట్టవచ్చినట్లు కనబడుతుంది, “పరిశుద్ధాత్మ - నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను” - పరిశుద్ధాత్మ నిజంగా ఒక వ్యక్తి కాకపోతే ఆయనను గురించి ఇలా మాటలాడటం బొత్తిగా పెడదారి పట్టించడమే ఔతుంది కదా! ఆయన విజ్ఞాపన చేస్తాడు: అటువలే "ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు” (రోమా 8:26) - యేసుక్రీస్తు చేసిన విజ్ఞాపన, ఆయన వ్యక్తియైఉన్నాడనీ, ఆయన విజ్ఞాపను చేసిన తండ్రి నుండి వేరైఉన్నాడని ఎలా నిరూపిస్తుందో ఆలాగే పరిశుద్ధాత్మ చేసే విజ్ఞాపన కూడా ఆయన వ్యక్తియైఉన్నాడని, అది కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తియైఉన్నాడని రుజువు చేస్తుంది.

ఆయనకు వ్యక్తిగత గుణగణాలు ఆపాదించబడ్డాయి. “ఆదరణకర్త” అంటూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి నాలుగుసార్లు ప్రస్తావించాడు, జీవముగల ఒక వ్యక్తి మాత్రమే “ఆదరణకర్తయై" ఉండగలడు. అంతేకాదు, ఆయన సాక్షియై ఉన్నాడు: “ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు” (హెబ్రీ 10:15); “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు” (రోమా 8:16) ఈ పదం న్యాయసంబంధమైన పదమై ఉండి, సుస్థాపితమైన రుజువులను లేక చట్టసంబంధమైన రుజువులను అందించడాన్ని సూచిస్తుంది; ఇలాంటి కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి వివేకియైన ఒక వ్యక్తి మాత్రమే సమర్థుడు. ఆయన నీతిమంతులనుగా తీర్చువాడు మరియు పరిశుద్ధపరచువాడు: “... ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి” (1 కొరింథీ 6:11).

పురుషవాచక సర్వనామములు ఆయన గురించి వాడబడ్డాయి. పరిశుద్ధాత్మకు వాడబడిన “న్యూమ” అనే గ్రీకు పదం, నపుంసక లింగంలో తటస్థ పదమై ఉంది, అయినా పరిశుద్ధాత్మ తరుచుగా పుంలింగంలో సంబోధించబడుతున్నాడు: “ తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అయిన తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మవచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును” (యోహాను 15:26) - వ్యాకరణాన్ని మరియు ఔచిత్యాన్ని ఉల్లంఘించకుండా ఒక వ్యక్తికి తప్ప ఇతరమైన మరి దేనికీ పురుషవాచక సర్వనామం వర్తించబడలేదు. పరిశుద్ధాత్మ గురించి మరొకసారి ప్రస్తావిస్తూ “నేను వెళ్లిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును” అని క్రీస్తు అన్నాడు (యోహాను 16:7). ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని ఒప్పుకోవడం, లేదా తన అపొస్తలులను తప్పుదోవ పట్టించి వారిని భయంకరమైన పొరపాటులోనికి నడిపించే మాటలను మన రక్షకుడు ఉపయోగించాడన్న దేవదూషణ చెయ్యడం కంటే మరొక ప్రత్యామ్నాయం లేదు. “నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు యుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును (యోహాను 14:16) - క్రీస్తునకూ (ఒక వ్యక్తి) మరియు ఒక నిర్గుణ ప్రభావానికీ మధ్య ఎలాంటి పోలికైనా సాధ్యం కాదు.

జాన్ ఓవెన్ గారు చెప్పిన విధంగా, "ఈ సాక్ష్యాలన్నిటి ఆధారంగా ఏది రుజువు చెయ్యబడాలని అవి రూపొందించబడ్డాయో దానిని బహు స్పష్టంగా రూఢిపరచుకున్నాము. అనగా కొందరు చెప్పే విధంగా పరిశుద్ధాత్మ దైవికమైన స్వభావంలో నివసిస్తున్న ఒక గుణం కాడు; కేవలం దేవునిలో నుండి బయటకు వచ్చే ఏదో ఒక ప్రభావం లేదా శక్తి కాడు; పరిశుద్ధపరచడంలో దేవుడు వినియోగించే శక్తి అంతకన్నా కాడు, కానీ పరిశుద్ధుడైన, తెలివిగల ఒక వ్యక్తి అని మనం సంపూర్ణంగా రూఢిపర్చుకొన్నామని కచ్చితంగా చెప్పవచ్చు.”

పై సత్యాలకు ఆయన తన ఆశీర్వాదాలను జతచేసి వాటిని మన హృదయాలకు వర్తింపచేసి, కీర్తించదగిన ఆయన వ్యక్తిత్వాన్ని మనలో ప్రతి ఒక్కరికీ ఇంకా ఎక్కువ వాస్తవం మరియు ప్రశస్తం గావించడం నిత్యుడైన పరిశుద్ధాత్మకు ప్రీతికరమగునుగాక. ఆమేన్.

పరిశుద్ధాత్మ దేవత్వము

పరిశుద్ధాత్మ చైతన్యయుతమైన, తెలివిగల, వ్యక్తియై ఉన్నాడని చెప్పడానికి సరిపడే సమృద్ధియైన మరియు స్పష్టమైన రుజువులను పరిశుద్ధ లేఖనాల సాక్ష్యంలో నుండి సమకూర్చుకోవడానికి  నేను రెండవ వ్యాసంలో ప్రయత్నించాను. ప్రస్తుత వ్యాసంలో ఆయన స్వభావం మరియు ఔన్నత్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను చేస్తున్న పరిశీలనలను చదువరులు అనవసరమైనదిగా భావించరని మన:పూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఈ అంశాన్ని తగిన విధంగా గౌరవించే ఏ వ్యక్తి అయినా ఇంతటి అపరిమితమైన ప్రాముఖ్యతగల విషయాన్ని విచారిస్తున్నప్పుడు, అతి సూక్ష్మంగానూ ప్రత్యేకంగానూ పరిశీలించడం అవసరమేనని వెంటనే కచ్చితంగా అంగీకరిస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని చూపించడానికి మేము మీ ముందుంచిన దాదాపుగా ప్రతి వాక్యభాగం ఆయన యొక్క దేవత్వం గురించిన నిర్ణయాత్మకమైన రుజువును కూడ కలిగి ఉందన్నది వాస్తవమైనప్పటికీ ఈ అంశానికి ఒక ప్రత్యేకమైన వ్యాసం కేటాయించడం అవసరమని నేను భావించాను - ఎందుకంటే ఈ అంశంపై పొరపాటు చేస్తే అది ఒకని ఆత్మకే ప్రాణాంతకం కాగలదు.

దేవుడా? దేవుడు కాదా?

పరిశుద్ధాత్మ ఒక వ్యక్తియై ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా ఎలాంటి సందిగ్ధము లేని విధంగా నేర్పిస్తుందని చూసాము కాబట్టి, స్వభావ రిత్యా  ఏమై ఉన్నాడు అన్నది తర్వాతి ప్రశ్న? అస్థిత్వ కొలమానంలో ఆయన స్థానమేంటి?

“ఆయన దేవుడై ఉండి, ఒక విశిష్టతగల వ్యక్తిగా తండ్రి మరియు కుమారునితో కూడా అనిర్వచనీయమైన ఐక్యత కలిగియుండి వారితో దైవికమైన స్వభావంలో సమానత్వం కలిగినవాడైయుండాలి లేదా దేవుని సృష్టమై  ఉండి, స్వభావంలోను ఘనతలోను దేవుని నుండి కొలవలేనంత దూరంగావుండి, సృష్టిలో ఆయనకు నియమింపబడిన స్థానాన్ని తప్ప, ఉత్పన్నమైన శ్రేష్టత మరేదైనను లేనివాడై యుండాలి. ఈ రెండింటికీ మధ్యలో ఏ మధ్యస్థానమూ లేదు. సృష్టికర్తకును సృష్టికిని మధ్యంతరమైనది ఏదీ సమ్మతింపబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ, సృష్టి యంతటికి పైగా అత్యున్నతమైన దేవదూత స్థానం కంటే పైగా ఉంచబడి, ఆ దూత మొదలుకుని జంతుజాలంలోని అత్యల్పమైన ప్రాకుడు జంతువును అధిగమించేంత లోతుగా వ్యాపించినవాడై ఉన్నా అప్పుడు కూడా దేవునితో ఆయనకు అంతరము ఇంకా అనంతమైనదై యుంటుంది కాబట్టి, నిత్యుడగు ఆత్మయని పిలువబడినవాడు, దేవుడైయుండజాలడు” అని రాబర్ట్ హాకర్ సరిగ్గానే అన్నారు.  

పరిశుద్ధాత్మను ప్రత్యేకపరిచే పేర్లు మరియు గుణగణాలు, ఆయనకు ఆపాదించబడిన స్వతఃసిద్ధమైన అనంతశక్తి, పరిమిత సామర్థ్యానికి వల్లపడని కార్యాలు ఆయనకు ఆరోపించబడటం, ఇవన్నీ దేవునికే తప్ప మరెవరికిని చెందవని సత్యవాక్యం నుండి చూపించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. దేవుడు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడన్నది ఎంత మర్మసహితమైనదిగా వివరించడానికి వీలులేనిదిగా మరియు మానవ హేతువుకు అందనిదిగా ఉండినప్పటికీ సరలమైన దైవవాక్య బోధలకు మనం సవినయంగా తలవంచినప్పుడు, ఏకతత్వం, సహశాశ్వతత్వం మరియు సహసమానత్వం గల దైవికమైన ముగ్గురు వ్యక్తులున్నారనే తుది నిర్ణయం తిరుగులేనిదై యుంటుంది. ఈ విశ్వమంతటిని సృజించడం, లేఖనాలు ప్రేరేపింపబడటం, యేసు క్రీస్తు నరరూపం దాల్చడం ఏర్పరచుకొనబడినవారు తిరిగి జన్మించడం మరియు పరిశుద్ధపరచబడటం వంటికార్యాలు ఎవరు చేసారో, ఆయన దేవుడై ఉన్నాడు, అయ్యిండాలి కూడా; లేక,2 కొరింథీ 3:17 :లోని మాటల ప్రకారం, “ప్రభువే ఆత్మ.”

 పరిశుద్ధాత్మ యొక్క దేవత్వవు రుజువులు

పరిశుద్ధాత్మ స్పష్టంగా దేవుడని పిలువబడ్డాడు. పేతురు, అననీయతో “పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?” అని చెబుతూ తర్వాతి వచనంలోనే "నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి” అన్నాడు (అపొ 5:3,4): పరిశుద్ధాత్మతో అబద్ధమాడటం దేవునితోనే అబద్ధమాడటమైతే, పరిశుద్ధాత్మ అవశ్యంగా దేవుడై యుండాలి. విశ్వాసులు “దేవుని ఆలయము” అని పిలువబడటానికి, “దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు” అన్నదే కారణం (1 కొరింథీ 3:16). అదేవిధంగా విశ్వాసి దేహము “పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది” అని చెప్పిన వెంటనే "గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" అను హెచ్చరిక చెయ్యబడింది 1 కొరింథీ 6:19, 20: 1 కొరింథీ 12లో నానా విధములైన ఆయన వరములు, పరిచర్యలు, మరియు కార్యాలు పేర్కోబడిన చోట, “ఆత్మ ఒక్కడే" (వ 4), “ప్రభువు ఒక్కడే" (వ 5), “దేవుడు ఒక్కడే” (వ 6) అని ఆయన సంబోధించబడుతున్నాడు. 2 కొరింథీ 6:16 :లో పరిశుద్ధాత్మ "జీవముగల దేవుడు” అని పిలువబడ్డాడు.

పరిశుద్ధాత్మ స్పష్టంగా యెహెూవా అని పిలువబడ్డాడు. అది సృష్టించబడిన ఏప్రాణికి వర్తించకూడని మహ సార్వభౌముడైనవానికి తప్ప మరెవరికిని వర్తించబడజాలనిదైన నామము. ఆది నుండి పరిశుద్ధులైన ప్రవక్తలందరి నోటి ద్వారా మాటలాడినవాడు యెహెూవాయే లూకా 1:68–75: అయినా 2 పేతురు 1:20లో ప్రవక్తలందరు “పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై" పలికారని పరోక్షంగా ప్రకటింపబడింది 2 సమూ 23:2-3: కూడ చూసి, అపొ 1:16: తో పోల్చి చూడండి! అరణ్యములో “దేవునికి విరోధముగా పాపం చేస్తూ మహెూన్నతుని మీద తిరుగబడిన” ఇశ్రాయేలీయులు శోధించింది యెహెూవానే (కీర్తనలు 78:17, 18). అయితే యెషయా 63:10లో దీనిని గురించి, వారు “తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దు:ఖింపజేసిరని” నిర్దిష్టంగా చెప్పబడింది! “యెహెూవా మాత్రము వారిని నడిపించెను” అని ద్వీతీ 32:12లో మనము చదువుతాము, అయితే ఇదే సమయంలో ఇదే ప్రజల గురించి మాట్లాడుతూ “యెహెూవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి” అని యెషయా 63:14 ఘోషిస్తుంది. నీవు పోయి యీ జనులతో ఇట్లనుము - మీరు నిత్యము వినుచుందురు” అని ప్రవక్తయైన యెషయాకు సెలవిచ్చింది యెహెూవాయే (యెషయా 6:8, 9), అయితే, “మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహీంపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము .... అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే” అని అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు (అపొ 28:25, 26). పరిశుద్ధాత్మకు యెహెూవా అనే గుర్తింపు ఉందని ఇంతకుమించి స్పష్టంగా మరేది నిర్ధారిస్తుంది? 2 థెస్స 3:5: లో పరిశుద్ధాత్మ “ప్రభువు” అని సంబోధించబడటాన్ని గమనించండి.

పరిశుద్ధాత్మలో దేవుని సంపూర్ణతలన్నీ ఉన్నాయి. దాని లక్షణాల చేత తప్ప ఒక ప్రాణి స్వభావం మరి దేనిచేత నిర్ధారింపబడుతుంది? ఒక దేవదూత లక్షణాలు ఉన్నవానిని దేవదూతగా లేదా ఒక మానవుని లక్షణాలు ఉన్నవానిని మానవునిగా వారి స్వభావానుగుణంగా గుర్తిస్తాము. అలాగే దేవునికి మాత్రమే చెందిన గుణగణాలు లేక లక్షణాలు కలిగియున్న వానిని దేవుడుగానే గుర్తించి ఆరాధించాలి. దేవునికి మాత్రమే చెందిన అసాధారణమైన గుణగణాలు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని లేఖనాలు అతి స్పష్టంగాను సమృద్ధిగాను రూఢిపరుస్తున్నాయి. అవి ఆయనకు నిరపేక్షమైన పరిశుద్ధతను ఆరోపిస్తున్నాయి. దేవుడు “పరిశుద్ధుడు”, “పరిశుద్ధుడైన వాడు” అని పిలువబడుచున్నాడు కాబట్టి “పరిశుద్ధతను బట్టి ఆయన మహానీయుడైయున్నాడని” ఆయన స్వభావం గురించిన ఆ శ్రేష్ఠమైన లక్షణం వర్ణించబడింది (నిర్గమ 15:11); అలాగే తన పరిశుద్ధ స్వభావం మరియు తన దేవత్వ వ్యక్తిత్వాన్ని సూచించడానికి త్రిత్వంలోని మూడవ వ్యక్తి “పరిశుద్ధమైన ఆత్మ" అని పిలవబడ్డాడు రోమా 1:2-7: పరిశుద్ధాత్మ నిత్యుడై యున్నాడు (హెబ్రీ 9:14). ఆయన సర్వవ్యాపియై యున్నాడు: “నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికీ పారిపోవుదును?” (కీర్తనలు 139:7). ఆయన సర్వజ్ఞానియై యున్నాడు (1 కొరింథీ 2:10,11 : చూడండి). ఆయన సర్వశక్తిమంతుడై యున్నాడు: “సర్వోన్నతుని శక్తి” యని సంబోధించబడుతున్నాడు (లూకా 1:35 , మీకా 3:8 : కూడా చూడండి, మరియు యెషయా 40:28 తో పోల్చండి).

పరిశుద్ధాత్మ యొక్క నిరపేక్షమైన సార్వభౌమత్వము మరియు సర్వోన్నత్త్వము ఆయన దేవత్వానికి రుజువు. మత్తయి 4:1లో, “యేసు అపవాదిచేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను” అని చెప్పబడింది: ఈ మధ్యవర్తికి నడిపింపునియ్యడానికి గల హక్కు దైవికమైన వ్యక్తికి కాకుండా ఇంకెవరికుంటుంది? విమోచకుడు దేవునికి కాకుండా ఇంకెవరికి తన్నుతాను వశం చేసుకుంటాడు! యోహాను 3:8లో మన ప్రభువైన యేసు క్రీస్తు (ఏ ప్రాణి యొక్క అధీనములోగాని, దిశానిర్దేశనములోగాని లేకుండానే) “తన కిష్టమైన చోటను విసరు” గాలికిని, పరిశుద్ధాత్మ యొక్క సర్వోన్నతాధికారంగల కార్యాచరణాలకును మధ్య గల పోలికను సాదృశ్యరూపకంగా చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ తన కార్యసిద్ధి నిమిత్తం తన సొంత ఇష్టం చొప్పున ఆత్న వరాలన్నిటిని పంచియిచ్చునని 1 కొరింథీ 12:11లో స్పష్టంగా దృఢపర్చబడింది. అలాగైతే ఆయన “సర్వాధికారియైన" దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యుండాలి. అపొ 13:2-4:లో, పరిచర్య పనుల కోసం పరిశుద్ధాత్మ మనుష్యులకు పిలుపునిస్తున్నాడని మనము గమనిస్తాము, ఇది కేవలం ప్రత్యేకమైన దైవాధికారమై యున్నది, అయితే దుర్మార్గులైన మనుష్యులు దీనిని తమ చేతులలోనికి తీసుకున్నారు. ఆయన పిలుపునిచ్చిన వీరు చెయ్యాల్సిన పనులను పరిశుద్ధాత్మయే నియమించి, వారు సంఘం చేత ప్రత్యేకించబడి పంపబడాలని వారికాజ్ఞాపించినట్లు ఈ వచనాల్లో మనము చూడవచ్చు. అపొ 20:28: లో పరిశుద్ధాత్మ సంఘంలో అధ్యక్షులను నియమించాడని స్పష్టంగా చెప్పబడింది.

పరిశుద్ధాత్మకు ఆపాదించబడిన కార్యాలు ఆయన దేవత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. తండ్రి మరియు కుమారుడిని సమానంగా సృష్టియే ఆయనకు ఆపాదించబడుతుంది: “ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును” (యోబు 26:13): “దేవుని ఆత్మ నన్ను సృజించెను” (యోబు 33:4). ఏర్పాటు అనే దైవిక చర్యలో ఆయన హస్తం ఉంది. (యెషయా 40:13-15, అపొ 16:6,7). లేఖనాలన్నీ దైవావేశము వలన కలిగాయి (2 తిమోతి 3:16), దీనికి మూలాధారము. పరిశుద్ధాత్మయే 2 పేతురు 1:21: యేసు క్రీస్తుకు మానవత్వం అద్భుతకరమైన రీతిలో పరిశుద్ధాత్మ చేత ధరింపచెయ్యబడింది. మత్తయి 1:20: యేసుక్రీస్తు తన పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు (యెషయా 61:1యోహాను 3:33-34). అద్భుతకార్యాలను ఆయన పరిశుద్ధాత్మ శక్తితో చేసాడు (అపొ 12:38). ఆయన మృతులలో నుండి పరిశుద్ధాత్మ చేత లేపబడ్డాడు (రోమా 8:11). ఇలాంటి కార్యాలు దేవత్వం గల వ్యక్తి కాకుండా మరెవరు చెయ్యగలరు!?

ప్రియ చదువరీ, పరిశుద్ధాత్మ, దేవుడు కాకుండా మరెవరూ కాదనే రుజువు నీ వ్యక్తిగత మరియు నీ అంతరంగ అనుభవంలో ఉందా? పరిమితి గల ఏ శక్తీ చెయ్యలేని కార్యం ఆయన నీలో చేసాడా? ఆయన నిన్ను మరణం నుండి జీవంలోనికి తెచ్చాడా? క్రీస్తునందు నిన్నొక నూతన సృష్టిగా చేసాడా? సజీవ విశ్వాసం నీకు అనుగ్రహించాడా? దేవుని కొరకు కనిపెట్టాలనే పవిత్ర వాంఛలతో నిన్ను నింపాడా? ప్రార్థనాస్పూర్తి అనే ఊపిరిని ఆయన నీలో ఊదుతున్నాడా? యేసుక్రీస్తు సంగతులను నీకు చూపిస్తున్నాడా? దేవుని ఉపదేశాలు మరియు వాగ్దానాలు నీ హృదయానికి అన్వయిస్తున్నాడా? అలాగైతే ఇవన్నీ పరిశుద్ధాత్మ యొక్క దేవత్వానికి నీ సొంత హృదయంలోనే సాక్ష్యాలై ఉన్నాయి.